జీహెచ్‌ఎంసీ సమావేశం నుంచి అధికారులు వాకవుట్!

సాధారణంగా శాసనసభ లేదా మండలి సమావేశాలలో ఏదో అంశం మీద నిరసన తెలియజేసేందుకు ప్రతిపక్షసభ్యులు వాకవుట్ చేస్తుంటారు. కానీ ఈరోజు హైదరాబాద్‌, జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు వాకవుట్ చేశారు! 

ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే బిజెపి కార్పొరేటర్లు అధికారులను గట్టిగా నిలదీశారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ప్రదీప్ అనే పిల్లాడిపై కుక్కలు దాడిచేయడంతో చనిపోయాడు. ఇటీవల సికింద్రాబాద్‌, కలాసీగూడలో ఓ బాలిక కాలువలో పడి కొట్టుకుపోయి చనిపోయింది. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌ రోడ్ నంబర్ 45లో వివేక్ అనే బాలుడు రోడ్డుపక్కన నీళ్ళ గుంతలో పడి చనిపోయాడు. ఈ ఘటనలపై బిజెపి కార్పొరేటర్లు అధికారులపై ఆగ్రహం ప్రదర్శిస్తూ “వేలకువేలు జీతాలు తీసుకొంటున్న మీరందరూ నగరంలో పసిపిల్లలు చనిపోతున్నా పట్టించుకోరా? మీకెవరికీ బాధ్యత లేదా?” అంటూ గట్టిగా నిలదీయడంతో వారు బిజెపి కార్పొరేటర్లకు నచ్చేజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ వారు పదేపదే నిలదీసి ప్రశ్నిస్తుండటంతో సహనం కోల్పోయిన అధికారులు మేయర్ అనుమతితో నిరసన తెలియజేస్తూ సమావేశం నుంచి వాకవుట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. మొదట జలమండలి అధికారులు వాకవుట్ చేయగా, వారికి సంఘీభావం తెలుపుతూ జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా వాకవుట్ చేసి వెళ్ళిపోయారు. 

సమావేశం మద్యలో అధికారులు వాకవుట్ చేయడంపై “అధికారులేమైనా రాజకీయ నాయకులనుకొంటున్నారా?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార బిఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నందునే తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఇంత ధైర్యంగా సమావేశం నుంచి బయటకువెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈవిదంగా చేసి మేయర్‌ని అవమానించారని బిజెపి కార్పొరేటర్లు వాదిస్తే, వారే అధికారులను అవమానించారని బిఆర్ఎస్ కార్పొరేటర్లు, మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.