వరి రైతులూ దిగులుపడొద్దు... తడిసిన ధాన్యం కొంటాము: కేసీఆర్‌

అకాలవర్షాలతో తెలంగాణలో లక్షలాది ఎకరాలలో పంటలు నాశనం అయ్యాయి. ముఖ్యంగా వరి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ఈ సమస్యపై సిఎం కేసీఆర్‌ మంగళవారం సచివాలయంలొ మంత్రులు, వివిదశాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటనష్టంటో తల్లడిల్లుతున్న రైతులకు ఊరట కల్పిస్తూ ఈసారి తడిసిన ధాన్యాన్ని కూడా సాధారణ ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కష్టకాలంలో రైతులకు బాసటగా ప్రభుత్వం నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ఏమి పేర్కొందంటే.... 

 అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుంటా సేకరిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 

వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. 

గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా ఎటువంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని, ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం వ్యవసాయ శాఖను ఆదేశించారు. కాగా... అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సీఎం సూచించారు.

ఈరోజు డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోల్లు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.