సచివాలయం కావచ్చు... పోలీస్ కమాండ్ కంట్రోల్ కావచ్చు... ఫ్లైఓవర్ కావచ్చు లేదా సాగునీటి ప్రాజక్టులు కావచ్చు... లేదా డా.అంబేడ్కర్ విగ్రహం కావచ్చు సిఎం కేసీఆర్, మంత్రులు వేటికైనా శంఖుస్థాపన చేశారంటే వాటి నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తవవలసిందే. ఇటీవలే మహాద్భుతమైన సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో నిర్మించిన బిఆర్ఎస్ భవన్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన దానికి ప్రారంభోత్సవం చేసేందుకు సిఎం కేసీఆర్‌తో సహ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ముఖ్యనేతలు ఈరోజు సాయంత్రం లేదా బుదవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు.
ఢిల్లీ నడిబొడ్డున వసంత విహార్ వద్ద 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో దీనిని నిర్మించారు. దీనికి సిఎం కేసీఆర్ 2021 సెప్టెంబర్ 2వ తేదీన శంకుస్థాపన చేశారు. రెండేళ్ళలోగానే నిర్మాణం పూర్తిచేయించి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఢిల్లీలో సొంత భవనం ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులను భుజాన్న వేసుకొని పూర్తి చేయించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ దీని నిర్మాణ బాధ్యతను కూడా చేపట్టి శరవేగంగా పూర్తి చేయించారు. బుదవారం దీని ప్రారంభోత్సవం చేయబోతున్నందున ఆయన సోమవారం ఢిల్లీ వెళ్ళి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి ఏర్పాట్లు చేస్తున్నారు.