అంగరంగ వైభవంగా తెలంగాణ సచివాలయం... ప్రారంభోత్సవం

తెలంగాణ కీర్తిప్రతిష్టలను దశదిశలా మారుమ్రోగిపోయేలా నిర్మించిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయానికి ఆదివారం మధ్యాహ్నం సిఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ముందుగా ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాగిన సుదర్శనయాగంలో మంత్రి వేముల ప్రశాంత్ దంపతులు పాల్గొన్నారు. సిఎం కేసీఆర్‌ పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనాలు పొందిన తర్వాత రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తర్వాత ఆరో అంతస్తులో ఉన్న తన ఛాంబర్‌లో ప్రవేశించి తన సీట్లో కూర్చొని ముందుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరరాన ఫైలుపై తొలి సంతకం చేశారు. సచివాలయం ప్రారంభోత్సవ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సిఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపగా ఆయన కూడా వారందరికీ అభినందనలు తెలిపారు. తర్వాత మంత్రులందరూ వారికి కేటాయించిన ఛాంబర్లలో ప్రవేశించి ప్రజలకు, వివిద వర్గాలకు మేలు చేసే ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. 

మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ళకు సంబందించిన ఫైల్‌పై తొలి సంతకం చేయగా, మంత్రి హరీష్‌ రావు తన శాఖలలో అభివృద్ధి పనులకు సంబందించిన ఫైల్స్ పై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరకు రూ.34.25 కోట్లతో ట్యాబ్స్ కొనుగోలు చేసేందుకు ఫైల్‌పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేశారు. 

సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిద శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ ఈ కొత్త సచివాలయానికి వస్తారు. నేటి నుంచి ఈ నూతన సచివాలయం నుంచే తెలంగాణ రాష్ట్ర పాలన సాగుతుంది.