
శనివారం ఉదయం సికింద్రాబాద్ బేగంపేట్ పరిధిలోని కలాసీగూడాలో మౌనిక అనే బాలిక నాలాలో పడి చనిపోగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు బాలిక తల్లితండ్రులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు, జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని వారు ప్రకటించారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, “మౌనిక తన తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో నాలలో పది చనిపోవడం మాకు చాలా బాధ కలిగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాతే మా ప్రభుత్వం రూ.590 కోట్లు ఖర్చు చేసి నాలాలను మరమత్తులు చేయిస్తున్నాము. అవసరమైన చోట కొత్తవి నిర్మిస్తున్నాము. గతంలో నాలాలపై విచ్చలవిడిగా ఇళ్ళ నిర్మాణాలు జరగడం వలననే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవలే రూ.10 కోట్లు ఖర్చు చేసి కలాసీగూడలో నాలాకు మరమత్తులు చేశాము. ఇటువంటి సందర్భాలలో కూడా కొందరు రాజకీయాలు చేస్తూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది సక్రమంగా పనిచేస్తోంది కనుకనే ఇంటింటికీ మంచినీళ్ళు వస్తున్నాయి. విద్యుత్ వస్తోంది. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనపై రాజకీయాలు చేయడం తగదు,” అని హితవు పలికారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ సిబ్బందిని వెనకేసుకువస్తే మేయర్ విజయలక్ష్మి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సూచన మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలిక మృతికి కారణమైనందుకు జీహెచ్ఎంసీ ఏఈ తిరుమలయ్యను, వర్క్స్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.