దళితబంధు నొక్కేసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు?

ఇటీవల బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, కొంత మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు దళిత బంధు పధకంలో రూ.3 లక్షలు చొప్పున కమీషన్లు పిండుకొంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని, ఇటువంటివి తాను ఎంతమాత్రం సహించబోనని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేల జాతకాలు తన వద్ద ఉన్నాయని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే వారి తోకలు కత్తిరించేస్తానని కేసీఆర్‌ ఘాటుగా హెచ్చరించారు. 

దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని, అధికార పార్టీ నేతలు, వారి అనుచరులే ఆ సొమ్ము స్వాహా చేస్తున్నారని, దళితుల నుంచి కమీషన్లు పిండుకొంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. కేసీఆర్‌ ఇప్పుడు స్వయంగా వారి ఆరోపణలను ధృవీకరించిన్నట్లయింది. 

కనుక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దళితబంధులో కమీషన్లు కొట్టేస్తున్న ఆ ఎమ్మెల్యేల పేర్లను తక్షణం బహిర్గతం చేసి, వారందరినీ పార్టీలో నుంచి బహిష్కరించి, వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు రవి తదితర కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోకపోతే తాము గవర్నర్‌కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇదివరకు తాటికొండ రాజయ్యపై అవినీతి ఆరోపణలు వచ్చాయని మంత్రి పదవిలో నుంచి తొలగించారు. ఇప్పుడే ఆయనే మళ్ళీ దళిత బంధులో కమీషన్లు నొక్కేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?అని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌ వారి నుంచి ఆ సొమ్ముని తిరిగి రాబట్టి దళితులకు తిరిగి ఇప్పించి సదరు ఎమ్మెల్యేలను పార్టీలో నుంచి బహిష్కరించి చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్‌ చేశారు. దళిత బంధులో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారని కేసీఆర్‌ స్వయంగా చెప్పుకొన్నారు కనుక రాష్ట్ర హైకోర్టు ఈ కేసును సుమోటుగా స్వీకరించి విచారణ చేపట్టాలని దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.