
దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కొత్త సచివాలయం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దానిని సుమారు రూ.650 కోట్లు ఖర్చు చేసి నిర్మించిందని చెప్పుకొంటుంటే, రఘునందన్ రావు రూ.1,500 కోట్లు పెట్టి నిర్మించిందని చెప్పడం విశేషం. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కలకు రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు చేసిందని చెపుతున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం ఈ నెల 30న సచివాలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని కానీ దానికి తాను హాజరుకానని రఘునందన్ రావు చెప్పారు. అయితే మర్నాడు తన నియోజకవర్గంలో సమస్యల జాబితా పట్టుకొని కేసీఆర్ని కలిసేందుకు సచివాలయానికి వెళతానన్నారు. ప్రజాప్రతినిధులను లోనికి అనుమతిస్తారో లేక చంచల్గూడ జైలులోగా సవాలక్ష నిబందనలు పెట్టి వెనక్కు తిప్పి పంపించేస్తారో చూస్తానన్నారు.
ఒకవేళ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించకపోతే రూ.1,500 కోట్లు పెట్టి అంత పెద్ద సచివాలయం కట్టుకోవడం దండగే అని రఘునందన్ రావు అన్నారు. ప్రజాప్రతినిధులే కాదు... సచివాలయానికి డా.అంబేడ్కర్ పేరు పెట్టుకొన్నందున సామాన్య ప్రజలు సైతం ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండాలని, అప్పుడే సచివాలయానికి పెట్టిన పేరు సార్ధకం అవుతుందన్నారు. అయినా దుకాణం ఇప్పుడే తెరుస్తున్నారు కదా అప్పుడే తొందరపడి మాట్లాడటం ఎందుకు... ముఖ్యమంత్రి ప్రతీరోజూ సచివాలయానికి వచ్చి ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడ కూర్చోంటారో లేదో చూద్దామని రఘునందన్ రావు అన్నారు.