
టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడి అప్పుడే నెలరోజులు గడిచిపోయింది. మొదట్లో దానిపై అరిచిగోలచేసిన మీడియా, ప్రతిపక్షాలు ఎప్పటిలాగే వేరే అంశాలకు షిఫ్ట్ అయిపోవడంతో దాని గురించి మాట్లాడటం లేదు. దీంతో సిట్ మీద ఒత్తిడి తగ్గడంతో తాపీగా విచారణ జరుపుకొంటోంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, “ఇంకా ఎంతకాలం దీనిపై కూర్చోంటారని” ప్రభుత్వం తరపు వాదించిన ఏజీ ప్రసాద్‌ను ప్రశ్నించింది. మొదట్లో దర్యాప్తు వేగంగా చేసిందని కానీ ఇప్పుడు వేగం ఎందుకు తగ్గిందని హైకోర్టు ప్రశ్నించగా, దీనికి సంబందించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని సమాధానం చెప్పారు. అయితే విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారంటూ సూటిగా ప్రశ్నించి ఈ కేసు తదుపరి విచారణను జూన్ 5కి వాయిదా వేస్తున్నామని ఆలోగా విచారణ ముగించాలని హైకోర్టు సూచించింది.
అయితే ఏదైనా ఓ కేసు విచారణ దీర్గకాలం కొనసాగితే చివరికి ఎలా ముగుస్తుందో ఓటుకి నోటు కేసు, టాలీవుడ్ డ్రగ్స్ కేసులు తెలియజేస్తున్నాయి. బహుశః ఇది కూడా వాటిలాగే కొనసాగి చివరికి అటకెక్కిపోతుందేమో?