కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ వస్తారు: దేవగౌడ

టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చిన తర్వాత చాలా కాలం కేసీఆర్‌ పక్కన కనిపించిన కర్ణాటక మాజీ సిఎం, జెడిఎస్ నేత కుమారస్వామి ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. కర్ణాటకలోనే తొలిసారిగా బిఆర్ఎస్‌ పార్టీ పోటీ చేస్తుందని చెప్పిన కేసీఆర్‌ ఆ ఎన్నికలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధులను బరిలో దింపలేదు. కనీసం కుమారస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు. మంత్రులెవరినీ ప్రచారానికి పంపించలేదు. సీట్ల సర్దుబాటు విషయంలో అభిప్రాయబేధాలు ఏర్పడినందున ఇద్దరూ దూరమయ్యారని వార్తలు వచ్చాయి. బహుశః అవి నిజమే కావచ్చు. అయితే కేసీఆర్‌తో తాము టచ్చులోనే ఉన్నామని జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవగౌడ నిన్న చెప్పారు.

బెంగళూరులోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో మా పార్టీ తరపున తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం కొరకు వస్తారు. ఆయన ఎప్పుడు ఎక్కడెక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే అంశంపై మేము బిఆర్ఎస్‌ నేతలతో చర్చిస్తున్నాము. ఈసారి శాసనసభ ఎన్నికలలో మా పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. 

దేశ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు కనుక రాబోయే ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలలో పెను మార్పులు జరుగబోతున్నాయి. జాతీయ రాజకీయాలలో మార్పు గురించి తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, మమతా బెనర్జీలతో నిరంతరం చర్చించుకొంటూనే ఉన్నాము,” అని దేవగౌడ చెప్పారు. 

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు మే 10వ తేదీన ఒకేసారి పోలింగ్ జరుగబోతోంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది కనుక మే 8వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉంది. అయితే ఈ నెల 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. కనుక దానికి ముందు తర్వాత కేసీఆర్‌ చాలా బిజీగా ఉంటారు. కానీ కేసీఆర్‌ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని దేవగౌడ చెపుతున్నారు. కనుక చివరి రెండు రోజుల్లో తెలంగాణ సరిహద్దులోని కర్ణాటక జిల్లాలలో ఎన్నికల ప్రచారానికి వెళతారేమో?