నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈసారి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నాము. ఎన్నికలకి ఎక్కువ సమయం లేదు కనుక అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలి. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వాలనుకొంటున్నాను. కానీ కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని నివేదికలు వస్తున్నాయి. అటువంటివారు తక్షణం తమ పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల మద్యనే ఉండాలి. అందరూ వివాదాలకు దూరంగా ఉండాలీ. పార్టీకి నష్టం కలిగించేవిదంగా ఎవరు మాట్లాడినా, వ్యవహరించినా సాహించే ప్రసక్తి లేదు. నిర్ధాక్షిణ్యంగా తోకలు కత్తిరించేస్తాను.
మన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేయగలిగినంత చేసింది. ఇంకా చేస్తూనే ఉంటుంది. మరో పక్క అనేక సంక్షేమ పధకాలు కూడా విజయవంతంగా అమలుచేస్తున్నాము. మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి, అమలవుతున్న ఈ సంక్షేమ పధకాలను చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కూడా మన బిఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన బిఆర్ఎస్ బహిరంగసభే ఇందుకు తాజా నిదర్శనం.
కనుక దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మన తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ ఇంకా బలపడాలి. వచ్చే ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించాలి. అప్పుడే మనల్ని ఇతర రాష్ట్రాలలో ప్రజలు, పార్టీలు కూడా గౌరవిస్తాయి. కనుక ఇప్పటి నుంచే మీరందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని వారికి మరింత దగ్గర చేయండి,” అని కేసీఆర్ హితబోధ చేశారు.