విద్యుత్‌ సంస్థలలో ఆర్టిజన్స్ సమ్మె విరమణ

తెలంగాణ విద్యుత్‌ సంస్థలలో ఆర్టిజన్స్ జీతాలు పెంచాలంటూ చేపట్టిన సమ్మెను విరమించారు. సంస్థ సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుతో చర్చల అనంతరం ఆర్టిజన్స్ సంఘం ప్రధాన కార్యదర్శి చర్చలు సఫలం అయ్యాయని కనుక తక్షణం సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. జీతాల పెంపు, సమ్మె చేసినందుకు తొలగించిన 200 మంది ఆర్టిజన్స్‌ను మళ్ళీ విధులలోకి తీసుకొనేందుకు సీఎండీ అంగీకరించారని తెలిపారు. 

రాష్ట్రంలో గల 4 విద్యుత్‌ సరఫరా సంస్థలలో మొత్తం 20,500 మంది ఆర్టిజ న్స్‌గా పనిచేస్తున్నారు. వీరందరూ సబ్ స్టేషన్లు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణలో విద్యుత్‌ శాఖ ఇంజనీర్లకు, ఉద్యోగులకు సహాయంగా పనిచేస్తుంటారు. ఈ నెల 15వ తేదీన విద్యుత్‌ సంస్థలు 7% ఫిట్ మెంటుతో పీఆర్సీ ప్రకటించగా వాటికి శాస్విత ఉద్యోగ సంఘాలన్నీ అంగీకరించాయి. కానీ నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న తమకు అదనంగా మరో రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆర్టిజన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. ఈరోజు విద్యుత్‌ సౌధాలో జరిగిన చర్చలలో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు తమ డిమాండ్లలో చాలావాటిని అంగీకరించారని కనుక సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టిజన్స్ సంఘం ప్రధాన కార్యదర్శి తెలిపారు.