ఈ నెల 30వ తేదీన డా.బిఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఈ 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్, కార్యాలయం ఉంటాయి. దీనిలో జనహిత పేరుతో ముఖ్యమంత్రి ప్రజలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యేందుకు పెద్ద హాలు ఉంటుంది. దీనిలో 250 మంది కూర్చొనేందుకు వీలుగా నిర్మించారు.
ఇదికాక మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యేందుకు ‘క్యాబినెట్ హాల్’ వేరేగా నిర్మించారు. దీనిలో 25 మంది మంత్రులు, 30-50 మంది అధికారులు కూర్చొని చర్చించుకొనేందుకు వీలుగా సకల సౌకర్యాలు, పెద్ద ఎల్ఈడీ స్క్రీన్, మంచి సౌండ్ సిస్టమ్‌తో నిర్మించారు. ఈ రెండు కాకుండా 50-60 మంది కూర్చోనేందుకు వీలుగా మరో రెండు సమావేశ మందిరాలు నిర్మించారు.
సీఎస్-అధికారులతో సమావేశాలు నిర్వహించడం కోసం వీటిని నిర్మించిన్నట్లు తెలుస్తోంది. ఆరవ అంతస్తులోనే ముఖ్యమంత్రిని కలిసేందుకు వివిఐపీలు, విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు వారికి విందుల కోసం లేదా భోజన సమావేశాల కోసం వేరే డైనింగ్ హాల్ నిర్మించారు. దీనిలో 25-30 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.
ఇక మిగిలిన అంతస్తులలో గ్రౌండ్ ఫ్లోర్‌లో రెవెన్యూ శాఖ, మొదటి అంతస్తులో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్ధికశాఖ, మూడో అంతస్తులో వ్యవసాయ శాఖ, నాలుగో అంతస్తులో సాగునీటి శాఖ మరియు న్యాయశాఖలు, 5వ అత్ణస్తులో సాధారణ పరిపాలన శాఖ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) కొరకు కేటాయించారు.
ఆయా శాఖాధిపతులకు ఈ విషయం తెలియజేస్తూ ఉత్తర్వులు కూడా వెళ్ళాయి. కనుక ఆ ప్రకారం ఆయా అంతస్తులలో ఆయా శాఖలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని, అధికారులకు, ఉద్యోగులు పనిచేసుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. ఇవాళ్ళ సిఎస్ శాంతికుమారి ఆయా శాఖాధిపతులు, కార్యదర్శులతో సమావేశమయ్యి ఈ ఏర్పాట్ల గురించి చర్చించారు.