ఆ విషయంలో బిఆర్ఎస్‌ పార్టీయే నంబర్:1

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ నంబర్:1 స్థానంలో నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్:1 స్థానంలో నిలబెడుతున్న బిఆర్ఎస్‌ పార్టీ కూడా విరాళాల సేకరణలో నంబర్:1 స్థానంలో నిలిచింది. బిఆర్ఎస్‌ తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ రెండో స్థానంలో ఉంది. 

2021-2022 సంవత్సరాలలో కేసీఆర్‌ నాయకత్వంలోని బిఆర్ఎస్‌ పార్టీ రూ.40.90 కోట్లు విరాళాలు సేకరించగా, అర్వింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమాద్మీ పార్టీ రూ.38.20 కోట్లు విరాళాలతో రెండో స్థానంలో ఉందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదికలో పేర్కొంది.

ఆ తర్వాత స్థానాలలో వరుసగా జెడిఎస్ (కర్ణాటక) రూ.33.20 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీ (యూపీ) రూ.29.70 కోట్లు, వైసీపీ (ఏపీ) రూ.20 కోట్లు విరాళాలు సేకరించాయని ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలలో పేర్కొన్నాయని ఏడీఆర్ తెలిపింది. 

దేశంలో 26 ప్రాంతీయ పార్టీలు కలిసి రూ.189.80 కోట్లు విరాళాలు సమాడించుకోగా వాటిలో మొదటి 5 పార్టీలే రూ.162.21 కోట్లు సాధించుకొన్నాయని తెలిపింది.