అలా చేస్తే నేను మహారాష్ట్రలో అడుగుపెట్టను: కేసీఆర్‌

సోమవారం ఔరంగాబాద్‌లో జరిగిన బిఆర్ఎస్‌ బహిరంగసభలో సిఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ, “తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పధకాలన్నిటినీ ఇక్కడ మహారాష్ట్రలో కూడా అమలుచేసే మాటయితే నేను ఈ రాష్ట్రంలో అడుగుపెట్టను. మరో రాష్ట్రానికి వెళ్తాను. మహారాష్ట్రలో ప్రతీరోజు ఆరేడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే, మోడీ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా ఆఫ్రికా నుంచి చిరుతపులులను తీసుకువచ్చామని గొప్పగా చెప్పుకొంటున్నారు. 

మోడీ ప్రభుత్వం దేశానికి, ప్రజలకు ఏదో మేలు చేస్తుందని అధికారం కట్టబెడితే కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వ రంగ సంస్తలన్నిటినీ అమ్మి పడేస్తోంది. మేకిన్ ఇండియా అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది కానీ నేటికీ దేశంలో ఊరుకో చైనా బజారు కనిపిస్తుంటుంది.

మహారాష్ట్రలో గోదావరి, కృష్ణ, మంజీర, భీమా, పెన్ గంగ, వెన్ గంగ, ఘటప్రభ, ప్రవర వంటి అనేక నదులు పారుతున్నా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో రైతులకు సాగునీరు ఎందుకు అందించలేకపోతున్నాయి? దేశ ఆర్ధికరాజధాని ముంబై అని చెప్పుకొంటున్నప్పుడు మహారాష్ట్రాలో ఇంకా ఎందుకు ఇంత బీదరికం నెలకొని ఉంది?డాక్టర్ అంబేడ్కర్ పుట్టిన ఈ నేలపై దళితులను ప్రభుత్వం పట్టించుకోదా?ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశమంతటా దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తిభిన్నమైన పరిస్థితులున్నాయి. రైతులకు 365 రోజులు సాగునీరు అందిస్తున్నాము. 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాము. ప్రతీ ఇంటికీ స్వచ్చమైన త్రాగునీరు అందిస్తున్నాము. రాజధాని హైదరాబాద్‌ నగరంలో ప్రజలు ఏ నీళ్ళు త్రాగుతున్నారో ఆదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామాలలో ప్రజలు కూడా అదే నీరు త్రాగుతున్నారు. రైతులకు రైతుబంధు, దళితులకు దళిత బంధువంటి సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నాము. 

పాలకులకు దూరదృష్టి, చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేసుకోవచ్చో మేము తెలంగాణలో చేసి చూపించాము. ఇక్కడి ప్రభుత్వానికి అటువంటి తపన, ఆలోచనా రెండూ లేవు. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే సరిపోతుంది. ఈ పరిస్థితులలో మార్పు తేవాలనే ఉద్దేశ్యంతోనే బిఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భవించింది. మహారాష్ట్రలో బిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే మహారాష్ట్రను కూడా తెలంగాణ రాష్ట్రంలాగా అన్నివిదాల అభివృద్ధి చేసి చూపిస్తాము. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్‌ని గెలిపించి ఆదరించండి. ఈ పరిస్థితులను పరివర్తన చేసి చూపిస్తాము. త్వరలోనే నాగ్‌పూర్‌లో బిఆర్ఎస్‌ శాస్విత కార్యాలయం ఏర్పాటు చేస్తాము,” అని అన్నారు.