ఓవైసీపై ఇంకెంతకాలం ఏడుస్తారు? అసదుద్దీన్

ఆదివారం చేవెళ్ళలో జరిగిన బిజెపి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాష్ట్రంలో బిజెపిలోకి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తానని, కేసీఆర్‌ ప్రభుత్వం స్టీరింగ్ ఓవైసీల చేతిలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. 

“ఇంకా ఎంతకాలం ఓవైసీ...ఓవైసీ... అంటూ మా మీద పడి ఏడుస్తారు? ఎప్పుడూ ఇటువంటి పనికిమాలిన డైలాగ్స్ చెపుతుంటారు. అప్పుడప్పుడు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యల వంటి వాస్తవ పరిస్థితుల గురించి కూడా మాట్లాడండి. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది,” అని ట్వీట్‌ చేశారు. 

ఎల్లప్పుడూ ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప తెలంగాణ రాష్ట్రాభివృద్ధిపై బిజెపికి ఎటువంటి విజన్ లేదని, కనుక ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తుంటారని అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే అని ముస్లింలలో నిరుపేదలను కూడా ఆదుకొంటామని చెపుతుంటే, అమిత్‌ షా తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తామని చెపుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు, ముస్లింలంటే అమిత్‌ షాకు ఎందుకు అంత ద్వేషమని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.