ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌ తాళాల కధ అలా ముగిసింది

హైకోర్టు ఆదేశం మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌ తాళాలను ఆదివారం జిల్లా కలెక్టర్‌ యాస్మిన్ బాషా, అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈసీ అధికారులు పగులగొట్టి తలుపులు తెరిచారు. వాటిలో భద్రపరిచిన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలను, సిసి కెమెరా రికార్డింగ్ వివరాలతో నివేదిక రూపొందించి హైకోర్టుకు సమర్పించనున్నారు. 

ఇంతకీ ఈ ధర్మపురి స్ట్రాంగ్ రూమ్‌ తాళాలు ఎందుకు పగులగొట్టాల్సి వచ్చిందంటే... 2018 శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్, ఆనాడు ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులపై ఒత్తిడి చేసి గెలిచిన్నట్లు ప్రకటింపజేసుకొన్నారని, ఆయన చేతిలో 441 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 

దానిపై విచారణ జరిపిన హైకోర్టు స్ట్రాంగ్ రూమ్‌ తెరిచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు, సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. కానీ స్ట్రాంగ్ రూమ్‌ తాళాలు పోయాయని చెప్పడంతో హైకోర్టు ఆదేశం మేరకు అందరి సమక్షంలో ఈసీ అధికారులు నిన్న తాళాలు పగులగొట్టారు. 

స్ట్రాంగ్ రూమ్‌ తలుపులు తెరిచిన తర్వాత ముందుగా ఈవీఎంలన్నీ భద్రంగా ఉన్నాయని ధృవీకరించుకొన్నారు. ఆ తర్వాత 2018 ఎన్నికలకు సంబందించి ప్రొసీడింగ్స్, 17ఏ, 17సీ ఫామ్స్, ఫలితాలు వెల్లడించిన రోజున సిసి కెమెరాల రికార్డింగులను ఈసీ అధికారులు తీసుకొన్నారు. ఆ వివరాలతో నివేదికను రూపొందించి ఈ నెల 26న హైకోర్టుకు సమర్పించిన తర్వాత మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తదుపరి విచారణ చేపడుతుంది. 

ఒకవేళ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ఆరోపిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్ ఓట్ల లెక్కింపు అధికారులపై ఒత్తిడి చేసి గెలిచిన్నట్లు ప్రకటించుకొన్నట్లు రుజువైతే ఆయన ఎమ్మెల్యే, మంత్రి పదవులు కోల్పోవడంతో పాటు ఎన్నికల నియామవళి ప్రకారం వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించబడే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఎన్నికల అధికారులను ఒత్తిడి చేయలేదని నిరూపించబడితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావాను ఎదుర్కోవలసి రావచ్చు.