బిజెపి కోటలో కేసీఆర్‌... కేసీఆర్‌ కోటలో బిజెపి!

మహారాష్ట్ర బిజెపి కోటలో పాగా వేయాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే, తెలంగాణ కోటలో పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున బిజెపి పెద్దలు రాష్ట్రంలో పర్యటిస్తూ బహిరంగసభలు నిర్వహిస్తుంటే, కేసీఆర్‌ పొరుగునే బిజెపి పాలిత మహారాష్ట్రలో సభలు నిర్వహిస్తున్నారు.    

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం చేవెళ్ళలో జరిగిన బిజెపి విజయ్‌ సంకల్ప సభలో సిఎం కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా అవినీతి పాలన సాగుతోంది. రాష్ట్రంలో ఎప్పుడు ఏ పరీక్ష జరిగినా ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు వచ్చేస్తుంటాయి. ఏమని అడిగితే బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేయిస్తారు కానీ సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించమంటే జరిపించరు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమోదిస్తుంది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీలకు ఇస్తుంది. కేసీఆర్‌ కారు స్టీరింగ్ ఓవైసీల చేతిలో ఉంది. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు.  

కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారు కానీ అక్కడ ప్రధాని కుర్చీ ఏమీ ఖాళీగా లేదు. నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధాని కాబోతున్నారు. కనుక కేసీఆర్‌ తన ముఖ్యమంత్రి సీటుని కాపాడుకొంటే మంచిది. కేసీఆర్‌ తెలంగాణలో అక్రమంగా దోచుకొన్న సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో తన బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ఖర్చు చేస్తున్నారు. ఆయన వెనక మజ్లీస్‌ పార్టీ ఉందని మాకు తెలుసు. మజ్లీస్ పార్టీ పెత్తనం చలాయిస్తున్నంత వరకు తెలంగాణలో ఏ ప్రభుత్వమూ స్వతంత్రంగా పనిచేయలేదు. బిజెపి ఒక్కటే దానిని ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి  చేయగలదు. త్వరలోనే నేను మళ్ళీ రాష్ట్రానికి వస్తాను,” అని తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ వాటికి ఘాటుగా జవాబు చెప్పారు. ఈరోజు బిజెపి పాలిత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో బిఆర్ఎస్‌ బహిరంగసభ నిర్వహించబోతోంది. ఈ సభలో కేసీఆర్‌ అమిత్‌ షా విమర్శలకు బహుశః సమాధానం ఇవ్వొచ్చు.