మనం మనం తన్నుకోవలసిన సమయం కాదిది మిత్రమా!

హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి నేతల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మునుగోడు ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు సిఎం కేసీఆర్‌ నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రూ.25 కోట్లు అందుకొన్నారని ఈటల రాజేందర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వాటిని రేవంత్‌ రెడ్డి వెంటనే ఖండించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తాను కేసీఆర్‌ నుంచి డబ్బు తీసుకొనే దౌర్భాగ్య పరిస్థితిలో లేనని ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి కూడా ఈటల రాజేందర్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, “కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?మీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించుకోవచ్చు కదా?మేము కేసీఆర్‌ నుంచి డబ్బు తీసుకోలేదని హైదరాబాద్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నాము. మీరూ చేస్తారా?” అంటూ సవాల్ విసిరారు. 

ఈ వ్యవహారంలో బిజెపి సీనియర్ మహిళా నేత చాలా భిన్నంగా స్పందిస్తూ, “బిఆర్ఎస్‌తో పోరాడే తమ్ముళ్ళు రేవంత్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ గారు అంటూ... ఇప్పుడు మనం పోరాడవలసింది బిఆర్ఎస్‌ పార్టీ మీద తప్ప మనలో మనం పోరాడుకోవడం సరికాదు. మనం పోరాడుకొంటుంటే బిఆర్ఎస్‌ వినోదం అవుతుంది,” అంటూ సున్నితంగా హెచ్చరించారు. ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే....