
బిఆర్ఎస్ పార్టీలో నుంచి ఇటీవల ఇద్దరు సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బయటకు పంపించగా ఇప్పుడు మరొక సీనియర్ నేత పార్టీని వీడేందుకు సిద్దం అవుతున్నారు. ఆయనే నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకూళ్ళ దామోదర్ రెడ్డి. నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో విభేధాలు తారాస్థాయికి చేరుకోవడం అయినా కేసీఆర్ ఆయనకే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఎమ్మెల్సీ కూచుకూళ్ళ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ నేతలు వెళ్ళి ఆయనను కలిసి పార్టీలోకి ఆహ్వానించగా కూచుకూళ్ళ సానుకూలంగా స్పందించారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు నాగం జనార్ధన్ రెడ్డి రూపంలో అదే సమస్య ఎదురవుతోంది. ఆయన కూడా నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గానికే చెందినవారే కావడం కూచుకూళ్ళ రాకను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు నచ్చజెప్పి ఒప్పించే బాధ్యతను పార్టీలో సీనియర్ నేత కె.జానారెడ్డి తీసుకొన్నారు.
కనుక ఈ సమస్య పరిష్కారం అయితే సరూర్ నగర్ కాంగ్రెస్ బహిరంగసభలో కూచుకూళ్ళ దామోదర్ రెడ్డి పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొంటారు. ఆయన మొదట కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత బిఆర్ఎస్‌లో చేరి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ప్రభుత్వ విప్‌గా వ్యవహరించారు.