ఆస్కార్ టీంతో అమిత్‌ షా భేటీ... అభినందించడానికేనా?

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ నెల 23న చేవెళ్ళలో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్నారు. ఆరోజు మధ్యాహ్నం 3.50 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడకి దగ్గరలో ఉన్న నోవాటేల్ హోటల్‌ చేరుకొని సాయంత్రం 4 నుంచి అరగంట సేపు దర్శకుడు రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లతో భేటీ అవుతారు. ఆస్కార్ అవార్డు సాధించినందుకు వారిని అభినందించేందుకు హోటల్‌కు ఆహ్వానిస్తున్నారు. వారితో సమావేశం ముగిసిన తర్వాత రోడ్డు మార్గాన్న కారులో బయలుదేరి 6 గంటలకు చేవెళ్ళకు చేరుకొంటారు. ముందుగా పార్లమెంటరీ ప్రవాస్ యోజన సమావేశంలో పాల్గొంటారు. తర్వాత సభావేదిక వద్దకు చేరుకొని ప్రసంగిస్తారు. 

ఈ సందర్భంగా ఇటీవల బిజెపిలో చేరిన నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కూడా పార్టీలో చేరేందుకు బిజెపి నేతలు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అంగీకరిస్తే వారీరివురికీ కూడా అమిత్‌ షా కాషాయ కండువాలు కప్పి బిజెపిలో చేర్చుకొంటారు. ఈసారి వీలైనంత ఎక్కువ మంది ఇతర పార్టీల నేతలను ఈ సభలో బిజెపిలో చేర్చేందుకు రాష్ట్ర బిజెపి నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.