రేవంత్‌ రెడ్డికి సీనియర్లు షాకులు... నల్గొండ దీక్ష క్యాన్సిల్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి పార్టీలో సీనియర్లు తమ తడాఖా చూపిస్తున్నారు. తమని సంప్రదించకుండా రేవంత్‌ రెడ్డి తమ తమ జిల్లాలలో నిరుద్యోగదీక్షల షెడ్యూల్ ప్రకటించినందుకు సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇద్దరూ తీవ్ర అభ్యంతరాలు తెలుపగా తాజాగా ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో గురువారం నల్గొండలో జరుపదలచిన నిరుద్యోగ దీక్షను రద్దు చేస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించకతప్పలేదు. టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని రేవంత్‌ రెడ్డి బాగానే అందిపుచ్చుకొని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయబోతే సీనియర్లతో ఇటువంటి విబేధాలు వలన ఇప్పుడు తనే ఇబ్బంది పడుతున్నారు. 

ఇవి సరిపోవన్నట్లు పార్టీలో సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ‘నేనే ముఖ్యమంత్రినవుతానంటే కాదు... నేనే అవుతానంటూ’ కీచులాడుకొంటున్నారు. పార్టీలో ఒకరిపై మరొకరికి నమ్మకం, గౌరవం లేనప్పుడు, అందరూ కలిసికట్టుగా పనిచేలేయకపోతున్నప్పుడు ప్రజలు తమని ఎందుకు నమ్ముతారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపిస్తారు? అని ఆలోచిస్తే ఈవిదంగా ప్రవర్తించరు. 

అయినా ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచి కీచులాడుకోవడం ఏమిటి? తమని చూసి జనం నవ్వుకొంటున్నారని కూడా తెలుసుకోలేరా?