కామారెడ్డిలో మరో కొత్త మండలం ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. కామారెడ్డి జిల్లాలో పాల్వంచ కేంద్రంగా మండలం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం ఆరు నెలల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిగణనలోకి తీసుకొని పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుదవారం జీవో జారీ చేశారు. 

కామారెడ్డి జిల్లాలో మాచారెడ్డి మండలంలోని తొమ్మిది గ్రామాలను, రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని కలిపి పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కి చేరింది. అవి: బాంసువాడ, బీర్కూర్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్, పిట్లం, నస్రుల్లాబాద్, పెద్ద కొడప్‌గల్, కామారెడ్డి, భిక్నూర్, రాజంపేట్, దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట్, తాడ్వాయి, సదాశివనగర్, యోల్లారెడ్డి, గాంధారి, లింగంపేట్, నాగారెడ్డిపేట, దొంగ్లీ, పాల్వంచ మండలాలు. 

ఇది కాక జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలంలోని తొమ్మిది గ్రామాలను వేరు చేసి ఎర్రవల్లి మండలం ఏర్పాటు చేసేందుకు నేడు తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.