ఇప్పుడు నన్ను డాక్టర్ సీతక్క అని పిలవచ్చు!

“నేను పెద్దయ్యాక తుపాకీ పట్టుకొని నక్సలైట్‌గా మారుతానని నా చిన్నప్పుడు అనుకోలేదు. నక్సలైట్‌గా మారిన తర్వాత న్యాయవాదిగా మారుతానని ఎన్నడూ అనుకోలేదు. కానీ అయ్యాను. న్యాయవాదిగా మారిన తర్వాత ఎమ్మెల్యేనవుతానని అనుకోలేదు. కానీ అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత డాక్టరేట్ డిగ్రీ పూర్తి చేస్తానని ఎన్నడూ అనుకోలేదు. కానీ అయ్యాను. ఇప్పుడు మీరు నన్ను డా.అనుసూయ సీతక్క అని పిలవచ్చు,” అని ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌ చేశారు. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన సీతక్క తన జీవిత ప్రస్థానం గురించి క్లుప్తంగా చెప్పిన మాటలు ఇవి. 

రెండు తెలుగు రాష్ట్రాలలో ‘సీతక్క’ పరిచయమే అవసరమే లేని పేరు. నిష్కళంక చరిత్ర కలిగిన ఓ రాజకీయ నాయకురాలిగా ఆమె ఎంత పేరు పొందారో, ములుగు, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం తదితర జిల్లాలలో మారుమూల గ్రామాలలో నివసించే ఆదివాసీ ప్రజలకు కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవలు మరువలేనివి. తుఫానులు, వరదలు, వర్షాలు ముంచెత్తిననప్పుడు మారుమూల గ్రామాలలో మొట్టమొదట సహాయ సామాగ్రితో వనదేవతలా ప్రత్యక్షమయ్యేది సీతక్కే. 

అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినప్పటికీ అత్యంత నిరాడంబర జీవితం గడిపే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మంగళవారం డాక్టరేట్ డిగ్రీ అందుకొన్నారు. వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో అడవులలో నివసించే సంచారజాతికి చెందిన గుత్తికోయలు ఏవిదంగా సమాజంలో నిరాదరణకు గురవుతున్నారో, ఏవిదంగా వారికి హక్కులు నిరాకరించబడుతున్నాయనే అంశాలపై పీహెచ్‌డీలో భాగంగా ఆమె పరిశోధన చేసినందుకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఆమెకు నేడు గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందజేసారు. ఇదే విషయం ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకొన్నారు.