మహారాష్ట్రలో బిఆర్ఎస్‌ బహిరంగసభ ఏప్రిల్ 24న

తెలంగాణ సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో బిఆర్ఎస్‌ పార్టీ జాతీయ రాజకీయాలలో భాగంగా పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్‌, కాంధార్-లోహలో వరుసగా రెండు బహిరంగసభలు నిర్వహించి తన ఉనికిని చాటుకొంది. ఇప్పుడు మహారాష్ట్రలోనే ఔరంగాబాద్ జిల్లాలో ఏప్రిల్ 24న ముచ్చటగా మూడో బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకొంటోంది.

ఈ సభ ఏర్పాట్లు, ఔరంగాబాద్‌లో ప్రచారం, జనసమీకరణ బాధ్యతలను బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బిఆర్‌ఎస్‌ పార్టీ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేలకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలోజరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాలను మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు వీడియో స్క్రీన్ కలిగిన ఏడు ప్రచార రధాలను సోమవారం శంభాజీనగర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంచించారు. వీటిని ఔరంగాబాద్ జిల్లాలోని 9 శాసనసభ నియోజకవర్గాలలో తిప్పుతూ మరాఠీ ప్రజలకు, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజలను చైతన్యపరిచేందుకు వినియోగిస్తారు. 

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 13 జాతీయ అవార్డులు లభించగా బిజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రకు ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఈవిషయాన్ని కూడా ఈ సభలో హైలైట్ చేసి తెలంగాణ మాదిరిగా మహారాష్ట్రలో పల్లెలు, పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని కోరుకొంటే బిఆర్ఎస్‌ పార్టీని ఆదరించాలని సిఎం కేసీఆర్‌ చెప్పనున్నారు.