కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 జాతీయ పంచాయతీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రామే 13 అవార్డులు గెలుచుకొంది. ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్’ కింద తొమ్మిది విభాగాలలో తెలంగాణలోని నాలుగు పంచాయతీలకు మొదటి ర్యాంక్, రెండింటికి రెండో ర్యాంక్, మరో రెండింటికి మూడో ర్యాంక్ సాధించి అవార్డులు సొంతం చేసుకొన్నాయి. వీటిలో మొదటి ర్యాంక్ సాధించిన పంచాయతీలకు కోటి రూపాయలు, రెండో ర్యాంక్ సాధించినవాటికి రూ.75 లక్షలు, మూడో సాధించినవాటికి రూ.50 లక్షలు చొప్పున నగదు పురస్కారాలు కూడా అందజేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం రూ.12.5 కోట్లు నగదు పురస్కారం లభించింది.
అదేవిదంగా నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద మూడు విభాగాల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది గ్రామాలకు అవార్డులు లభించాయి. వాటిలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండీ ఉత్తమ మండల పంచాయత్, ములుగు ఉత్తమ జిల్లా పంచాయతీ, సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం స్పెషల్ కేటగిరీ విభాగంలో అవార్డులు గెలుచుకొన్నాయి.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం ఈ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, స్థానిక సంస్థల అధికారులు అందుకొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు.