
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై సెక్షన్స్ 120బి, 420, 447, 505 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌పై కరీంనగర్ జైలుకు పంపగా, ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. అయితే ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ ప్రజలను రెచ్చగొట్టేవిదంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆయన తమకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఈ కుట్రను చేదించేందుకుగాను ఆయన వాడిన మొబైల్ ఫోన్‌ను తమకు అప్పగించాలని కోరుతున్నప్పటికీ ఆయన ఇవ్వడంలేదని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు సోమవారం హన్మకొండ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై రేపు (మంగళవారం) విచారణ చేపద్తామని న్యాయస్థానం తెలిపింది.
ఇదివరకు కూడా ఓ సారి పోలీసులు బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరారు కానీ న్యాయస్థానం వారి అభ్యర్ధనను మన్నించలేదు. ఈ కేసు విచారణలో సహకరించడంలేదని పోలీసులు చెపుతున్నారు కనుక న్యాయస్థానం బండి సంజయ్ బెయిల్ రద్దు చేస్తుందా లేదా? అనే విషయం రేపే తెలుస్తుంది.