ఆంధ్రా మంత్రులకు అంత ఉక్రోషం దేనికి?

రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆంద్రా మంత్రులకు నేడు మరోసారి చురకలు వేశారు. సిద్ధిపేటలో నేడు ఆత్మీయ సమ్మేళనంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మొన్న ఆంద్రాకు చెందిన మేస్త్రిలతో సమావేశమైనప్పుడు ఇక్కడ మంచి అభివృద్ధి జరుగుతోంది. చక్కటి సంక్షేమ పధకాలు కూడా అమలుచేస్తున్నాము. హాయిగా ఇక్కడే ఉండిపోరాదా? మిమ్మల్ని కూడా మా బిడ్డాలా కడుపులో పెట్టుకొని చూసుకొంటాము అని అన్నాను. ఇదేమి తప్పా? ఈ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో వారిని వివరించేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. వాటిని పట్టుకొని ఆంద్రా మంత్రులు ఎగిరెగిరిపడ్డారు. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నేనేమీ ఆంధ్రా ప్రజలని అవమానించలేదు. 

ఆనాడు ప్రత్యేకహోదా కోసం పోరాడుతామన్నారు. కానీ మీ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు? ఇప్పుడు ఎందుకు పోరాడటం లేదు?విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు? అని అడిగాను. నేను ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపునే మాట్లాడాను తప్ప వారిని కించపరలేదు. కనుక ఆంద్రా మంత్రులకి మళ్ళీ చెపుతున్నా... మీకు చేతనైతే మీ విశాఖ ఉక్కు గురించి పోరాడండి... ప్రత్యేకహోదా కోసం పోరాడండి... మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని పొలాలకు నీళ్ళు పారించుకొంటున్నాము. మీరు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని మీ పొలాలకు నీళ్ళు పారించుకోండని చెప్పాను. 

అయినా నేను మా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకొనేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పోల్చి చెప్పాను తప్ప మరో ఉద్దేశ్యంతో కాదు. 

ఇవాళ్ళ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయానికి రోజుకి 8 గంటలే విద్యుత్‌ ఇస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలలో ఏడు గంటలే ఇస్తున్నారు కానీ తెలంగాణలో 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పాను. అలాగే బిజెపి పాలిత రాష్ట్రాలలో రూ.700-800 పింఛన్ ఉంటే మా తెలంగాణలో రూ.2,000 ఉందని చెప్పుకోవడంలో తప్పేముంది? చేసింది చెప్పుకోవడంలో తప్పేముంది?” అని అన్నారు. 

కానీ మంత్రి హరీష్‌ రావు మళ్ళీ తన ప్రసంగంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను, ఏపీలో పరిస్థితుల గురించి మళ్ళీ ప్రస్తావించారు కనుక మరోసారి ఏపీ మంత్రులు ఎదురుదాడి చేయడం ఖాయమనే భావించవచ్చు.