అందరితో పాటు నేనూ కేసీఆర్‌కి కమీషన్లు ఇచ్చాను: పొంగులేటి

బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ, అన్నిటికీ మించి పెద్ద కాంట్రాక్టర్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏబీఎన్ మీడియా సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ తమ న్యూస్ ఛానల్లో ఆదివారం ప్రసారమైన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కె’ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేశారు. కేసీఆర్‌తో మీకు ఎందుకు పడలేదు?రాజకీయ కారణాలా లేక మరేమైనా కారణాలా?ఆయన మిమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారు? అంటూ అడిగిన ప్రశ్నలకి పొంగులేటి సమాధానం చెపుతూ, “బిఆర్ఎస్ పార్టీలో అందరూ తనకు అణగిమణిగి ఉండాలని కేసీఆర్‌ కోరుకొంటారు. కనుక పార్టీలో ఎవరూ బలమైన నాయకులు లేకుండా చూసుకొంటారు. నేను కేసీఆర్‌ మాటలు నమ్మి బిఆర్ఎస్ పార్టీలో చేరాను. 

ఆయన నాకు రూ.2,900 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చినమాట ఎంత వాస్తవమో అందరూ కాంట్రాక్టర్లలాగే నేను ఆయనకు దానిలో పర్సంటేజి (కమీషన్‌) చెల్లించిన మాట కూడా అంతే వాస్తవం. వాటికి సంబందించిన పూర్తి సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. తగిన సమయంలో వాటిని బయటపెడతాను. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.700 కోట్లు బిల్లుల బకాయిలు రావలసి ఉందగా నేను మరో రూ.450 కోట్ల విలువగల పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఈ 8 ఏళ్ళలో ఒక్క సాగునీటి శాఖలోనే మొత్తం రూ.1.80 లక్షల కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇవికాక రోడ్లు భవనాలు వంటి ఇతర శాఖలలో వేలకోట్ల విలువ చేసే పనులు జరిగాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి కేసీఆర్‌ చేతికి వేలకోట్లు కమీషన్లు అందుతుంటాయి. వాటితోనే కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు సహకరించే పార్టీల ఎన్నికల ఖర్చులు భరించడానికి సిద్దపడుతున్నారు,” అని అన్నారు. 

తనను ఎందుకు బయటకు పంపారనే ప్రశ్నకు సమాధానంగా “రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉండటం, నేను ఆ వర్గానికే చెందిన బలమైన నాయకుడిని కావడం, రాజకీయంగా బలపడేందుకుగాను నేను కాంట్రాక్టులు చేసి సంపాదించిన డబ్బులో కొంత ఖర్చు చేస్తుండటం వంటివి కేసీఆర్‌కు గిట్టలేదు. అందుకే పార్టీలో చేర్చుకొన్నాక నన్ను రాజకీయంగా బలపడకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇక తనకి నా అవసరం లేదని భావించి బయటకు పంపేశారు,” అని అన్నారు. 

Courtecy ABN