ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక వాటి కోసం ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సిఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో స్థానిక నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం కారణంగా అపశ్రుతులు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.
వారం రోజుల క్రితం ఖమ్మం జిల్లా చీమలపాడు గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం జరుగవలసి ఉంది. ఆ సందర్భంగా బిఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చగా, ఆ నిప్పు రవ్వలు సమీపంలో ఉన్న ఓ గుడిసెపై పడి మంటలు అంటుకొన్నాయి. దాంతో గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. ప్రభుత్వం చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఆ ఘటనలో క్షతగాత్రులు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు.
ఇంతలోనే నిన్న ఆదివారం కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వేదిక కూలడంతో మంత్రి గంగుల కమలాకర్, స్థానిక జెడ్పీటీసీ, పలువురు బిఆర్ఎస్ నేతలు గాయపడ్డారు. మంత్రి గంగుల ఎడమకాలుకి స్వల్పగాయం కాగా, జెడ్పీటీసీ కాలు ఫ్రాక్చర్ అయ్యింది. వేదికపైకి ఎక్కువమంది చొచ్చుకురావడంతో కూలిపోయింది. మంత్రి గంగుల ప్రాధమిక చికిత్స చేయించుకొని కాలుకి కట్టు కట్టించుకోగా గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు.