కేంద్ర ఎన్నికల కమీషన్ తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. గత ఎన్నికలు 2018, డిసెంబర్ 7వ తేదీన జరిగాయి. కనుక మళ్ళీ 2023, డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు కనీసం మూడు నెలల ముందు అంటే అక్టోబర్‌లో షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. అంటే మరో 5 నెలలు మాత్రమే సమయం ఉందన్న మాట. కనుక ఎన్నికల నిర్వహణ గురించి రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించేందుకు కేంద్ర ఎన్నికల డెప్యూటీ కమీషనర్ నితీశ్ వ్యాస్ నేతృత్వంలో అధికారుల బృందం శనివారం హైదరాబాద్ వచ్చింది.
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తో ఢిల్లీ నుంచి ఈసీ బృందం సమావేశమయ్యి ఎన్నికల నిర్వహణకు సంబందించి వివిద అంశాల గురించి చర్చించారు. ముందుగా ఓటర్ల జాబితాలను సిద్దం చేయాలని కోరారు. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ కొరకు రిటర్నింగ్ అధికారుల జాబితాను సిద్దం చేసిన్నట్లయితే మళ్ళీ తాము వచ్చి రెండు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి అన్ని ఈవీఎం మెషిన్లను పరీక్షించడం మొదలుపెట్టి, ఏవైనా మరమత్తులు అవసరమైతే చేయించాలని కోరారు.
రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీలలో ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
పార్టీ నాయకులు అప్పుడే టికెట్స్ కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్-బిజెపిల మద్య ప్రధానంగా పోటీ ఉండవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనబడకపోవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్యే కనుక గట్టి పోటీయే ఇస్తుంది.