విగ్రహం కాదు విప్లవం: కేసీఆర్‌

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహాన్ని నేడు సిఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తూ, “స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలైనప్పటికీ నేటికీ దేశంలో దళితులు పేదరికంలోనే మగ్గుతున్నారు. వారు కూడా సమాజంలో మిగిలిన వర్గాలతో సమానంగా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే దళిత బంధు పధకం రాష్ట్రంలో అమలుచేస్తున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50 వేల మందికి దళిత బంధు పధకం అందించాము. ఈ సంవత్సరంలో మరో 1.25 లక్షల మందికి దళిత బంధు అందిస్తాము. కేంద్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల మందికి దళిత బంధు పధకం అమలుచేసేరోజు తప్పక వస్తుంది. ఇప్పటికే మన బిఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలలో మంచి స్పందన లభిస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని రాష్ట్రాలు మనతో కలుస్తాయని ఆశిస్తున్నాను,” అని అన్నారు.  

డా.అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు గురించి మాట్లాడుతూ, “ఇది కేవలం ఓ విగ్రహం మాత్రమే కాదు ఓ విప్లవం. బడుగు బలహీనవర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు స్ఫూర్తిగా ఏర్పాటు చేసుకొన్న విగ్రహం. పక్కనే సచివాలయానికి కూడా డా.అంబేడ్కర్‌ పేరు పెట్టుకొని గౌరవించుకొన్నాము. అటు హుస్సేన్ సాగర్‌లో బుద్ధవిగ్రహం కూడా ఉంది. ఇటు అమరవీరుల స్మారకస్థూపాన్ని కూడా ఏర్పాటు చేసుకొన్నాము. ఈ విగ్రహం, ఈ స్మారక స్తూపం అన్నీ మన త్యాగాలకు, ఆలోచనలకు, విధానాలకు ప్రతీకలుగా నిలుస్తాయి,” అని అన్నారు. 

“డా.అంబేడ్కర్‌ పేరిట ఏటా అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకొన్నాము. దీని కోసం రూ.51 కోట్లతో ఓ నిధి ఏర్పాటు చేస్తాం. దనైపై ఏటా రూ.3 కోట్లు వడ్డీ వస్తుంది. ఆ మొత్తాన్ని అవార్డుల కోసం వినియోగిస్తాము,” అని కేసీఆర్‌ ప్రకటించారు.