ఇంట్లో ఈగల మోత అంటే ఇదేనేమో?

మరో 15 రోజులలో అంటే ఏప్రిల్ 30వన భవ్యమైన తెలంగాణ సచివాలయానికి ప్రారంభోత్సవం జరుగబోతోంది. మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ నడిబొడ్డున 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహాన్ని సిఎం కేసీఆర్‌ ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణ ఏర్పడక మునుపు ఎవరూ ఇటువంటివి కలలో కూడా ఊహించేలేకపోయేవారు. కానీ అసాధ్యాలను సుసాధ్యాలను చేసి చూపుతున్నారు కేసీఆర్‌. 

అయినప్పటికీ కేసీఆర్‌కు ఇంట్లో ఈగల మోత... అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలు భరించక తప్పడం లేదు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీనిపై మాట్లాడుతూ, “125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహం పెట్టినంత మాత్రన్న కేసీఆర్‌కు దళితుల మీద ప్రేమ ఉన్నట్లు కాదు. డా.అంబేడ్కర్‌ వ్రాసిన రాజ్యాంగాన్నే పనికిరాదని మళ్ళీ కొత్తది వ్రాయాలన్న కేసీఆర్‌ ఇప్పుడు ఆయన విగ్రహన్నే ఆవిష్కరిస్తున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలను, ప్రతిపక్షాలను అణచివేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులకు తూట్లు పొడుస్తున్న కేసీఆర్‌ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే డా.అంబేడ్కర్‌ విగ్రహం ఇప్పటికి సిద్దం అయ్యేలా చేశారు. ఒకవేళ మరో మూడు, నాలుగేళ్ళ తర్వాత ఎన్నికలు జరిగేమాటయితే కేసీఆర్‌ ఈరోజు డా.అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేవారా? అంతా ఎన్నికల స్టంట్,” అని విమర్శించారు. 

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందిస్తూ, “కేసీఆర్‌ ముందుగా రాష్ట్రంలో దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాత డా.అంబేడ్కర్‌ విగ్రహాన్ని తాకాలి. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు. ఇన్నేళ్లలో కేసీఆర్‌ ఏనాడూ డా.అంబేడ్కర్‌ జయంతి వేడుకలో ఎందుకు పాల్గొనలేదో ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాలి. ఇది ఎన్నికల సంవత్సరం గాబట్టి ఈరోజు కేసీఆర్‌ తొలిసారిగా డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ చేసి జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దళిత బంధు పధకంలో నిజంగా ఎంతమంది దళితులకు సహాయం చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి,” అని విమర్శించారు.