హైదరాబాద్‌లో పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం... షురూ

హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురుస్తోంది. ఉదయం 6 నుంచి మూడు నాలుగు గంటల సేపు హైదరాబాద్‌ నగరంతో సహా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలలో వర్షం కురుస్తుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలోని తూర్పు విదర్భ నుండి మరాట్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సుమారు 0.9కిమీ ఎత్తున ఉపరితల ద్రోణి నెలకొని ఉన్నందున పైన పేర్కొన్న ప్రాంతాలలో రాబోయే మరికొన్ని గంటలపాటు ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులలతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అయితే నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల నమోదవుతాయని సూచించింది. వర్షం కురుస్తున్న కారణంగా హైదరాబాద్‌లో నేడు ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మద్య ఉంటాయని తెలిపింది. కనుక ప్రజలు అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం మంచిది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. 

ఇవాళ్ళ మిట్టమధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ సమీపంలో నెలకొల్పిన 125 అడుగుల డా.అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40-50 వేలమందిని 750 బస్సులలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. సరిగ్గా ఈరోజే హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తూ వాతావరణం కాస్త చల్లబడటం చాలా సంతోషకరమైన విషయమే కదా?