కర్ణాటక ఎన్నికలలో అంతా నాటు నాటే!

కర్ణాటక శాసనసభకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అధికార బిజెపి 224 స్థానాలకు అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు కూడా అభ్యర్ధుల జాబితాలను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌, బిజెపిలు హోరాహోరీగా పోరాడుతూ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

రాజకీయ పార్టీలు, నాయకులు సోషల్ మీడియాలోకి కొత్తగా ప్రవేశించినప్పుడు అదో వింత. ఇప్పుడు కర్ణాటక శాసనసభ ఎన్నికలలో నాటు నాటు పాటను వాడేసుకొంటున్నారు. కర్ణాటక రాష్ట్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోడీ చేసిన పనులను వివరిస్తూ నాటునాటు పాట పేరడీని రాష్ట్ర బిజెపి నేతలు రూపొందించి విడుదల చేశారు. యావత్ దేశాన్ని, ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచదేశాలని ఉర్రూతలూగించి ఆస్కార్ అవార్డ్ గెలుచుకొన్న ఆ పాటకి రాజకీయ పేరడీ కడితే ఎంత గొప్పగా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్దం అవుతుంది. 

టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు కేసీఆర్‌. ముందుగా కర్ణాటకలో దేవగౌడ, కుమార స్వామిల జెడిస్‌ పార్టీతో కలిసి పోటీ చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు కూడా. కానీ నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కేసీఆర్‌ కానీ బిఆర్ఎస్‌ నేతలు గానీ  కర్ణాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం గురించి మాట్లాడటం లేదు. జెడిఎస్ పార్టీతో సీట్ల సర్దుబాట్లు కుదరకపోవడం వలననే ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది.