2.jpg)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఈరోజు విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్ సింగ్ కులస్తే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు తామేమీ తొందరపడటంలేదని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌ను బలోపేతం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని నడిపించేందుకు స్టీల్ ప్లాంట్ అధికారులతో, కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం ఓ భూటకమని ఫగన్ సింగ్ కులస్తే అన్నారు.
కేంద్ర మంత్రి చేసిన ఈ తాజా ప్రకటనపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాకుండా అడ్డుకొనేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. ప్రయివేటీకరణపై వెనక్కు తగ్గి ప్లాంట్‌ని నడిపిస్తామని చెప్పింది. ఇది కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ సాధించిన ఘనా విజయం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకోవడానికి పోరాడుతున్న కార్మికులకు లభించిన విజయం.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తమ కళ్ళ ముందే అమ్మేస్తున్నా అధికారంలో ఉన్న వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టిడిపిగానీ నోరు మెదపలేదు. ప్లాంట్‌ని, దానిలో పనిచేస్తున్న 40 వేల మంది కార్మికులను కాపాడుకొనేందుకు ప్రయత్నించలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పొరుగు రాష్ట్రంలోని ప్లాంట్ కోసం, కార్మికుల కోసం పోరాడేందుకు సిద్దం అయ్యి ప్రయివేటీకరణను అడ్డుకోగలిగిలిగారు. ఏపీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది,” అని అన్నారు.