దేశంలో అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటయింది. ఏప్రిల్ 14న అంటే రేపు అంబేడ్కర్ జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ పక్కన ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహాన్ని అట్టహాసంగా అవిష్కరించబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసిందంటే ఎంత అట్టహాసంగా నిర్వహించబోతోందో అర్దం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి దాదాపు 50,000 మంది బడుగుబలహీనవర్గాల ప్రజలను ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ తీసుకువచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ 750 బస్సులను ఏర్పాటు చేసింది. కనుక అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం సంబందిత శాఖల అధికారులు, సిబ్బంది భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
వేసవి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నందున దూర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నవారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్ళ ప్యాకెట్లు, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ఇచ్చేందుకు 80,000 స్వీట్ ప్యాకెట్స్, మధ్యాహ్నం పసందైన విందు భోజనాలు, తిరుగు ప్రయాణంలో కూల్ డ్రింక్స్, స్నాక్స్ వగైరా సిద్దం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో డా.అంబేడ్కర్ మనుమడు ప్రకాష్ అంబేడ్కర్, విగ్రహాశిల్పి రామ్ వి సుతార్ ముఖ్య అతిధులుగా పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ముందుగా సిఎం కేసీఆర్ విగ్రహావిష్కరణలో భాగంగా శిలాఫలకం ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 30 మంది బౌద్ద బిక్షువులతో కలిసి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొంటారు. అదే సమయంలో హెలికాఫ్టర్ నుంచి విగ్రహంపై పూల వర్షం కురిపిస్తారు. అనంతరం సిఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
ఈ విగ్రహానికి సంబందించి కొన్ని ముఖ్యాంశాలు ఈవిదంగా ఉన్నాయి:
2016, ఏప్రిల్ 14: శంకుస్థాపన
అంచనా వ్యయం: రూ.146.50 కోట్లు
విగ్రహ శిల్పి: రామ్ వి సుతార్
కన్సల్టెంట్ సంస్థ పేరు: డిజైన్ అసోసియేట్స్ (నొయిడా).
గుత్తేదారు సంస్థ పేరు: కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్
డా.అంబేడ్కర్ ప్రాంగణం విస్తీర్ణం: 11.80 ఎకరాలు
పీఠం, విగ్రహం కోసం కేటాయించినది: 2.0 ఎకరాలు
విగ్రహ పీఠం (భవనం) ఎత్తు, వ్యాసం: 50 అడుగులు, 172 అడుగులు
విగ్రహం బరువు: 46,500 కేజీలు
విగ్రహంలో వినియోగించిన ఉక్కు: 79,100 కేజీలు
విగ్రహంలో వినియోగించిన ఇత్తడి: 96,000 కేజీలు.