13.jpg)
బుదవారం ఉదయం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో చీమలపాడు గ్రామంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ కార్యకర్తలు పటాసులు పేల్చడంతో పక్కనే ఉన్న గుడిసెపై పడి మంటలు అంటుకొన్నాయి. దాంతో గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు,
ఈ ప్రమాదంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “బిఆర్ఎస్ నేతలు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలనుకొంటే నిర్వహించుకోమనండి కానీ ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా? ఈ ఘటనకు బిఆర్ఎస్ నేతలను బాధ్యులను చేసి వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మహబూబ్నగర్లో కల్తీ కల్లు త్రాగి నిరుపేదలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే విచ్చలవిడిగా కల్తీకల్లు అమ్ముతుంటే, దానిని త్రాగి ప్రజలు చనిపోతుంటే సిఎం కేసీఆర్, సదరు మంత్రి ఏం చేస్తున్నారు? వారు దీనికి జవాబుదారీ వహించరా?“ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
చీమలపాడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షలు చొప్పున, గాయపడిన వారికి రెండు లక్షలు చొప్పున సిఎం కేసీఆర్ ఆర్ధికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని అండగా నిలుస్తుందని చెప్పారు.