ఏటా రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం పెద్దలకు, నేతలకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు. ఈరోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ దేశం మన అందరిదీ. కనుక దీనిని చక్కబెట్టుకోవలసిన బాధ్యత కూడా మనదే. దేశంలో కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ కలిసికట్టుగా నిలబడుతున్నాము. మన దేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు ప్రతీ ఒక్కరూ పోరాడాలి. మనది విష్టమైన గంగా యమునా తహజీబ్ సంస్కృతి. దీనిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు.
దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు దేశం కోసం పోరాడాలని ముందుకు వచ్చాను. మేము మహారాష్ట్రలో సభలు సమావేశాలు నిర్వహించడానికి వెళ్లినప్పుడు అక్కడ మాకు అపూర్వమైన స్వాగతం, ప్రజాధారణ లభించింది. అది చూసి మేము కూడా చాలా ఆశ్చర్యపోయాము. దేశానికి ఒక మంచి నాయకుడు, ఒక మంచి పార్టీ కావాలని ప్రజలు కోరుకొంటున్నారని మాకు అర్దమైంది. మా ఈ ప్రయత్నంలో అనేక అవరోధాలు ఎదురవుతున్నప్పటికీ చివరికి ధర్మమే గెలుస్తుందని నేను నమ్ముతున్నాను,” అని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా తమ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎటువంటి సంక్షేమ పధకాలు అమలుచేస్తోందో సిఎం కేసీఆర్ వివరించారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.