ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌ చురకలు.. భలే వేశారే!

ఏపీ-తెలంగాణ మంత్రుల మద్య మళ్ళీ మాటల యుద్ధాలు మొదలయ్యాయి. ఏపీలో కంటే తెలంగాణలోనే హాయిగా బ్రతకవచ్చు కనుక ఏపీలో మీ ఓటు హక్కు రద్దు చేసుకొని తెలంగాణలో నమోదు చేసుకోమని, మీకు అన్ని సంక్షేమ పధకాలు వర్తింపజేస్తామని మంత్రి హరీష్‌ రావు భవన నిర్మాణ కార్మికులతో అన్న మాటలపై సహజంగానే ఏపీ మంత్రులకు రోషం వచ్చింది. “ధనిక రాష్ట్రాన్ని మీ చేతులలో పెడితే మీ కేసీఆర్‌ ఏం చేశారో తెలీదా? హైదరాబాద్‌లో చిన్న వాన పడితే ఇళ్లమీద నుంచి నీళ్ళు వెళతాయి. జీడీపీలో మేము దేశంలోనే నంబర్: 1 స్థానంలో ఉన్నాము. మా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాలలో సగం కూడా మీ ప్రభుత్వం ఈయలేకపోతోంది. ఓసారి వీలుచూసుకొని మా రాష్ట్రానికి వస్తే మీ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో మా రాష్ట్రంలో ఎంత అద్భుతంగా ఉన్నాయో తేడా చూపిస్తాము.  ఏపీలో ఎంత అభివృద్ధి జరుగుతోందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు,” అంటూ ఘాటుగా హెచ్చరించారు. 

దానికి మంత్రి హరీష్‌ రావు కూడా వెంటనే అంతే ఘాటుగా బదులిచ్చారు. “మీ రాష్ట్రం గురించి మా చేతమాట్లాడించకండి. మేము నోరు విప్పితే మీకే అవమానం. మా రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు ఇస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొన్ని ప్రతీ గ్రామానికి నీళ్ళు పారిస్తున్నాము. ఒకప్పుడు బీడు పడిన భూములలో ఇప్పుడు మూడు పంటలు సాగుచేసుకొంటున్నాము. కానీ మీ రాష్ట్రం కోసం మీరేం చేసుకొన్నారు? పోలవరం ప్రాజెక్టు కట్టుకోలేకపోయారు. అంతమంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు. చివరికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేస్తుంటే దానిని కాపాడుకోలేకపోతున్నారు. మూడు పార్టీలు కలిసి రాజకీయాలు చేసుకొంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాయి. రాజకీయాలే తప్ప ఒక్క అభివృద్ధి పని జరిగిందా మీ రాష్ట్రంలో?” అంటూ ఎద్దేవా చేశారు.