తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, పార్టీలో నేతలు కుమ్ములాడుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వారిరువురిపై నిప్పులు చెరిగారు.
ఇటీవల ఆయన ‘హాత్ సే హాత్ జోడో’లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టారు. కానీ నాలుగు రోజుల తర్వాత పాదయాత్ర విరమించుకొన్నారు. దీనిపై మాణిక్‌రావు థాక్రే వివరణ కోరగా ఆయనతో వాగ్వాదానికి దిగిన్నట్లు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయనకు షోకాజ్ నోటీస్ పంపి తక్షణం సంజాయిషీ ఇవ్వాలని కోరింది.
ఇప్పటికే బిజెపి వైపు చూస్తున్న ఏలేటి తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై భగ్గుమన్నారు. రేవంత్ రెడ్డి, మాణిక్‌రావు థాక్రే ఇద్దరూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యి పార్టీ మారడం గురించి చర్చించారు.
బిజెపి ఆహ్వానిస్తోంది… పైగా దానికి ఈసారి విజయావకాశాలు ఉన్నాయి కనుక బిజెపిలో చేరడం మంచిదని అందరూ అభిప్రాయపడ్డారు. ఎల్లుండి (శుక్రవారం) మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ జరగనుంది. అదేరోజున ఢిల్లీ వెళ్ళి బిజెపిలో చేరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్ణయించుకొన్నట్లు సమాచారం. ఆయనతో పాటు బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జూపల్లి కృష్ణారావుని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కూడా బిజెపిలో చేర్చుకొనేందుకు బిజెపి నేతలు మంతనాలు సాగిస్తున్నారు. ఒకవేళ వారు కూడా అంగీకరిస్తే అందరూ శుక్రవారం ఢిల్లీ వెళ్ళి బిజెపి కండువాలు కప్పుకోవచ్చు.