మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఈరోజు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మోడీ తన ఇద్దరు దోస్తులకు దేశసంపద దోచిపెట్టి ఇస్తున్నారు. ఆదానీ కోసమే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి ఛత్తీస్‌ఘడ్‌లోని బైలదిలా నుంచి ముడి ఇనుము సరఫరా కాకుండా చేసి నష్టాలపాలు చేశారు. ప్లాంట్ నష్టాలలో ఉందనే సాకుతో ఇప్పుడు దానిని ఆదానీకి కట్టబెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు.
బైలదిలాకు కేవలం 180 కిమీ దూరంలో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి దానికి ముడి ఇనుము సరఫరా చేయమని మేము కోరితే సాధ్యం కాదని చెప్పారు. కానీ 1,800 కిమీ దూరంలో గుజరాత్‌లోని ముంద్రాకు తరలించుకుపోతున్నారు! బైలదిలా నుంచి కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ముడి ఇనుము సరఫరా చేయడానికి మోడీ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. బైలదిలా గనులను, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని రెంటినీ ఆదానీకి దోచిపెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారు.
బైలదిలా గనులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆదానీ చేతికి వెళ్లిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్రంగా నష్టపోతాయి. అందుకే మేము మోడీ ప్రభుత్వాన్ని అడ్డుకొనేందుకే ప్రయత్నిస్తున్నాము. మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టి దానిని కాపాడుకోవాలని అనుకొంటున్నాము తప్ప మాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరితో మాకు సంబందం లేదు. దాని ప్రభుత్వ రంగాసంస్థల ప్రయివేటీకరణపై వైసీపీ వైఖరిపై మాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏవిదంగా ఉండనేదే మాకు ముఖ్యం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌పై అధ్యయనం చేసేందుకు మా బృందాన్ని పంపిస్తున్నాము. అదిచ్చిన నివేదిక ఆధారంగా తగిన నిర్ణయం తీసుకొంటాము. జాతిసంపదను ఆదానీ దోచుకోకుండా అడ్డుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతాము,” అని అన్నారు.