కల్వకుంట్ల కవిత కాలు ఫ్రాక్చర్!

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. మూడు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని, అయితే ఎప్పుడు ఎవరికి ఏ సహాయం కావాలన్నా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని కల్వకుంట్ల కవిత తెలిపారు. మోకాలు జాయింట్‌లో లిగ్‌మెంట్ సమస్యనే అందరికీ అర్దమయ్యేవిదంగా కాలు ఫ్రాక్చర్ అని చెప్పినట్లు తెలుస్తోంది. 

కల్వకుంట్ల కవిత గురించి చెప్పుకోవలసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఆమెను విచారించడం, చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె చేస్తున్న పోరాటం గురించి చెప్పుకోవలసి ఉంటుంది. ఈడీ ఆమెను వరుసగా మూడుసార్లు ఢిల్లీకి రప్పించి ఈ కేసు గురించి ప్రశ్నించడంతో, ఆమెను అరెస్ట్‌ చేస్తారని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఈడీ అటువంటి ప్రయత్నం చేయలేదు. గత కొన్ని నెలలుగా ఈ కేసుపై చాలా దూకుడుగా వ్యవహరించిన ఈడీ, సీబీఐలు హటాత్తుగా చల్లబడిపోవడం ఆశ్చర్యకరమే. 

మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేవారకు పోరాడుతూనే ఉంటానని చెప్పిన కల్వకుంట్ల కవిత, ఈడీ విచారణ నిలిపివేసిన తర్వాత తన పోరాటాలు కూడా నిలిపివేసి హైదరాబాద్‌ చేరుకొన్న సంగతి తెలిసిందే.