తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర బిజెపి నేతలు నిత్యం విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారు. బిజెపి ఎంపీ సోయం బాపూరావు కూడా వారిలో ఒకరు. ఆయన ఆదివారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. రోడ్డు మార్గంలో 80 కిమీ కారులో ప్రయాణించి అక్కడకు చేరుకొన్నారు.
ర్యాలీ ముగిసిన తర్వాత ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, “ఓ జిల్లా కేంద్రానికి రోడ్లు ఇంత అధ్వానంగా ఉంటాయని నేను ఊహించలేకపోయాను. కేవలం 80కిమీ ప్రయాణించడానికి మూడు గంటల సమయం పట్టిందంటే ఏపీలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్దం అవుతోంది. రాష్ట్ర విభజన జరిగి అప్పుడే సుమారు 9 ఏళ్ళు కావస్తోంది. కానీ ఇంతవరకు జిల్లా కేంద్రానికి సరైన రోడ్డు లేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. పాడేరులో ప్రజలు ప్రతీరోజూ ఈ గుంతలు పడిన రోడ్లపై ప్రయాణిస్తూ ఏవిదంగా విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నారో నాకు అర్దం కావడం లేదు. పాడేరు చుట్టుపక్కల గ్రామాలలో నేటికీ ఇక్కడ అనేకమంది నిరక్షరాస్యులు ఉన్నారని విని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికైనా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన ఈ గిరిజన ప్రాంతంపై దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఇదివరకు మంత్రి కేటీఆర్ అంటే ఆంధ్రా మంత్రులు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి చెందిన బిజెపి ఎంపీ సోయం బాపూరావు కూడా ఏపీలో కంటే తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయని ఒప్పుకొన్నారు.