బిఆర్ఎస్‌లో ఇద్దరు సీనియర్ నేతలపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఇద్దరినీ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.
2018 ముందస్తు ఎన్నికల తర్వాత నుంచి కేసీఆర్ వారిద్దరినీ పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఇద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ సంయమనం పాటించారనే చెప్పవచ్చు. కానీ మళ్ళీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కేసీఆర్ నుంచి కబురు రాకపోవడంతో ఇద్దరూ కేసీఆర్‌తో యుద్ధానికి సిద్దమయ్యారు.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వారిద్దరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కేసీఆర్‌ని ఉద్దేశ్యించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, లాభాలతో నడుస్తున్న సింగరేణిని కేసీఆర్ అప్పులపాలు చేశారని, ఎత్తిపోతల పధకాల పేరుతో దోచుకొన్నారంటూ ఇద్దరూ తీవ్ర ఆరోపణలు చేశారు. కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా వెంటనే స్పందించి వారిద్దరినీ పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు వారిద్దరూ కూడా సిద్దంగానే ఉన్నారు కనుక బహుశః కేసీఆర్‌తో పోరును మరింత ఉదృతం చేయవచ్చు.