
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతినాడు సుమారు 50 వేల మందితో అట్టహాసంగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన ఈ విగ్రహం వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
రూ.146.50 కోట్లు వ్యయంతో 11.4 ఎకరాల విస్తీర్ణంలో పార్లమెంటు భవనాన్ని తలపించే విదంగా ఏర్పాటు చేసిన ‘అంబేడ్కర్ స్మృతివనం’ భవనంపై ఈ 450 టన్నుల బరువున్న 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్మృతివనంలో అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగంతో సహా ఆయన రచించిన అనేక పుస్తకాలు, జీవిత చరిత్ర, పోరాటాలను తెలియజేసే పుస్తకాలు, ఫోటోలు, వీడియోలతో కూడిన పెద్ద గ్రంధాలయం, మ్యూజియం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేశారు.