కేసీఆర్‌ ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడం లేదు: మోడీ

ప్రధాని నరేంద్రమోడీ నేడు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచదేశాలు ఆర్ధిక సమస్యలలో చిక్కుకొన్నప్పటికీ భారత్‌ మాత్రం నిలకడగా ముందుకు సాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సహా యావత్ దేశం అభివృద్ధిపధంలో ముందుకు సాగుతోందన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలుచేస్తోందని వాటి వలన తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. 

అయితే తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని ప్రధాని మోడీ అన్నారు. అందువల్లే రాష్ట్రంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున, నేడు ఒకేరోజున ఇన్ని అభివృద్ధి పనులు పూర్తిచేసుకొని కొత్తగా మరికొన్నిటిని ప్రారంభించుకొంటున్నామని ప్రధాని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో చిక్కుకొందని, ఆ కుటుంబ పాలన భారీగా అవినీతి జరుగుతోందన్నారు. కనుక కుటుంబ పాలన అంతమొందిస్తే తప్ప ఓ కుటుంబం చేతిలో ఉండిపోయిన అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు చేతికి రావన్నారు. కనుక వచ్చే ఎన్నికలలో బిజెపికే ఓట్లేసి గెలిపించాలని, తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

ఇంతకాలం కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి సహకరించకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సిఎం కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్లో అందరూ వాదించేవారు. కానీ ఇప్పుడు సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి సహకరించడంలేదని ఆరోపించడం విశేషం. అయితే ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు అప్పుడే తిప్పి కొడుతున్నారు. ఇంతకాలం రాష్ట్ర బిజెపి నేతలు అబద్దాలు చెప్పేవారని కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ కూడా అబద్ధాలు చెపుతున్నారని ఎద్దేవా చేశారు.