
ప్రధాని నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకొన్నారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకొని ముందుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించబోతున్న విద్యార్థులతో ప్రధాని ముచ్చటించిన తర్వాత పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్-తిరుపతి సర్వీసులను ప్రారంభించారు.
రేపు ఆదివారం నుంచి ఈ ట్రైన్ ప్రజలు అందుబాటులో ఉంటుంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలు తిరుపతి చేరుకొంటుంది. తిరుపతి నుంచి ప్రతీరోజు మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకొంటుంది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మద్య తిరుగబోయే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఉండదు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఏసీ చైర్ కారు టికెట్ ధర అన్ని కలుపుకొని రూ.1,680 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,080గా నిర్ణయించారు. భోజనం కావాలనుకొంటే అదనంగా మరో రూ.364 చెల్లించాల్సి ఉంటుంది.