ప్రధాని మోడీకి తలసానితోనే సరి

తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్‌ రానున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితని ఈడీ విచారించడం, పదో తరగతి ప్రశ్నాపత్రం లీకు కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ని కేసీఆర్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి జైలుకి పంపించడంతో ఇప్పుడు రాష్ట్రంలో బిఆర్ఎస్‌, బిజెపిల మద్య రాజకీయ పోరు పతాకస్థాయికి చేరుకొంది. 

కనుక సిఎం కేసీఆర్‌ నగరంలోనే ఉన్నప్పటికీ ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ని పంపిస్తున్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రావలసిందిగా సిఎం కేసీఆర్‌కి ఆహ్వానం అందినప్పటికీ హాజరుకావడం లేదు. ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినప్పుడే సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ వివిద జిల్లాలలో గనుల వద్ద బిఆర్ఎస్‌ అధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతోంది.

ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్‌ స్టేషన్, నగరంలో ప్రధాని పర్యటించే మార్గాలలో భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి ప్రధాని పర్యటన పూర్తయ్యేవరకు బేగంపేట-సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌-సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8,9,10 ప్లాట్‌ఫారంలపై రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. ప్రధాని పర్యటన ముగిసేవరకు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం వైపు నుంచి మాత్రమే ప్రయాణికులను రైల్వే స్టేషన్‌లోనికి అనుమతిస్తారు. 

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని బహిరంగసభలో పాల్గొనబోతున్నారు కనుక చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా పోలీసులను, స్పెషల్ ప్రొటెక్షన్ కమెండోలను మోహరించారు. బండి సంజయ్‌ అరెస్ట్‌, విడుదలైన మర్నాడే ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నందున, తన ప్రసంగంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రధాని ప్రసంగం అభివృద్ధి పనుల ప్రస్తావనకే పరిమితమైతే, మిగిలినవారు ఆయన సమక్షంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడటం ఖాయం.