బిజెపిలో చేరిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి

సమైక్య రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌  రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బిజెపి సీనియర్ నేత కె.లక్ష్మణ్ సమక్షంలో బిజెపిలో చేరారు. దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎదురీదుతున్నప్పుడు, రాజకీయ సన్యాసం పేరిట కాంగ్రెస్‌కు దూరంగా ఉండిపోయారు. ఎప్పటికీ ఆయన అలాగే ఉండిపోయినా లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కాంగ్రెస్‌లో అందరూ హర్షించి ఉండేవారు. కానీ ఆయన తన దోవ తాను చూసుకొంటూ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ్ళ రాజీనామా చేసి, బిజెపిలో చేరిపోయారు. 

లౌకికవాదపార్టీ అయిన కాంగ్రెస్‌కు పూర్తి వ్యతిరేకంగా హిందుత్వ, మతతత్వ అజెండాతో పనిచేసే బిజెపిలో చేరుతున్నారంటే ఆయనకు పదవులు, అధికారమే ముఖ్యం తప్ప సిద్దాంతాలు కాదని భావించవచ్చు. అయితే ఇప్పుడు దాదాపు రాజకీయనాయకులందరూ ఈవిదంగానే వ్యవహరిస్తున్నారు కనుక కిరణ్‌ కుమార్‌  రెడ్డి బిజెపిలో చేరడం పెద్ద విచిత్రమేమీ కాదు. 

బిజెపి అధిష్టానం బహుశః ఆయన సేవలను ఏపీలో వినియోగించుకోవచ్చు. కానీ ఆయనకు తెలంగాణ రాజకీయాలపై, కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడల గురించి గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. బిజెపి అధిష్టానం తెలంగాణ మీద దృష్టి పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉంది కనుక కిరణ్‌ కుమార్‌  రెడ్డి సేవలను తెలంగాణలో కూడా వినియోగించుకోవచ్చు. 

బిజెపిలో కిరణ్‌ కుమార్‌  రెడ్డి చేరికతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో సమీకరణలు, బలాబలాలు మారవచ్చు. వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి రావాలని టిడిపి పట్టుదలగా ఉంది. కానీ కిరణ్‌ కుమార్‌  రెడ్డిని బిజెపిలో చేర్చుకొని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పనిచేయడం మొదలుపెడితే, ఎన్నికలలో ఓట్లు చీలి టిడిపి, వైసీపీలు రెండూ నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక బిజెపిలో ఆయన చేరికపై టిడిపి, వైసీపీలు, అలాగే తెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రులు, బిఆర్ఎస్ నేతలు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.