ఈటల రాజేందర్‌కు కూడా పోలీసులు నోటీస్!

పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా ఇప్పటికే 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బండి సంజయ్‌ని కరీంనగర్‌ జైలుకి పంపారు కూడా. తాజాగా ఇదే కేసులో హుజురాబాద్‌ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా వరంగల్‌ పోలీసులు నోటీసులు పంపారు. మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ ఆయనకు కూడా ప్రశ్నాపత్రాన్ని వాట్సప్‌లో పంపినట్లు పోలీసులు గుర్తించడంతో ఆయన వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీస్ పంపారు. ఈ పేపర్ లీక్ అయిన కమలాపురం పాఠశాల ఈటల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉండటంతో, దీనిలో ఆయన ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కనుక ఈ వ్యవహారంపై ఆయన వివరణ కూడా తీసుకోవడం అవసరమని పోలీసులు భావిస్తున్నారు. 

బండి సంజయ్‌కి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపున బిజెపి లీగల్ సెల్ నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ స్వయంగా ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నారు. మరికొద్ది సేపటిలో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు కూడా బెయిల్‌ మంజూరు చేయకపోతే బిజెపి న్యాయవాదులు నేడే సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొన్నట్లు తెలుస్తోంది.